: టీమిండియా సిరీస్ మధ్యలో ఇలా జరగడం బాధ కలిగిస్తోంది: విండీస్ ఆటగాళ్లు
భారత పర్యటన మధ్యలోనే వెస్టిండీస్ ఆటగాళ్లు స్వదేశానికి పయనమవ్వనున్నారు. విండీస్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ముదిరి పాకానపడడంతో ఆటగాళ్లు అర్ధాంతరంగా వెనుదిరుగుతున్నారు. స్వంత ఖర్చులతో స్వదేశం చేరి బోర్డుతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. కానీ విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి టీమిండియా అంటే ఎనలేని అభిమానం. టీమిండియా ఆటగాళ్లకు, విండీస్ క్రికెటర్లకు మంచి దోస్తీ ఉంది. ఐపీఎల్ లో ఆకట్టుకునేలా ఆడుతూ వస్తున్న విండీస్ ఆటగాళ్లకు భారత్ లో భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. స్నేహితులను, అభిమానులకు నొప్పికలిగిస్తూ తాము తీసుకున్న నిర్ణయం బాధకలిగించేదే అయినప్పటికీ విండీస్ క్రీడాకారుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొంటున్నారు. సిరీస్ మధ్యలో వైదొలగడం విండీస్ క్రికెట్ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.