: ఐఫోన్-6 కోసం భారతీయుల బారులు!
యాపిల్ తాజా ఆవిష్కరణ ఐఫోన్-6, 6 ప్లస్ ల కోసం భారతీయులు బారులు తీరుతున్నారు. గురువారం అర్ధరాత్రి భారత మార్కెట్ లోకి ప్రవేశించిన ఐఫోన్-6ను చేజిక్కించుకునేందుకు దేశంలెోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎగబడుతున్నారు. రిలీజ్ సినిమా కోసం థియేటర్ల వద్ద పోటీలు పడుతున్న చందంగా యాపిల్ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ముందు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఐఫోన్-6 భారత్ లోకి అడుగుపెట్టకముందే దాదాపుగా 21వేల హ్యాండ్ సెట్ల కోసం ఆయా స్టోర్లకు ప్రీ ఆర్డర్లు వెల్లువెత్తినట్లు సమాచారం. తొలి విడతగా యాపిల్ సంస్థ తన ఐఫోన్-6, 6 ప్లస్ లకు సంబంధించిన 55 వేల హ్యాండ్ సెట్లను మాత్రమే భారత్ కు పంపింది. అయితే శుక్రవారం సాయంత్రానికి ఒక్కహ్యాండ్ సెట్ కూడా మిగలలేదట. ఈ దఫా యువతతో పాటు వృద్ధులు కూడా ఐఫోన్-6 కోసం పోటీలు పడ్డారు. పంపిన సరుకు గంటల వ్యవధిలోనే విక్రయమైపోవడంతో మరిన్ని హ్యాండ్ సెట్లను భారత్ పంపించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. యాపిల్ ఉత్పత్తులు భారత్ లో ఇన్ గ్రామ్ మైక్రో, రెడింగ్టన్, రాశి ఫెరిపెరల్, రిలయన్స్ తదితర ప్రధాన చైన్ స్టోర్లలో లభ్యమవుతున్నాయి.