: 8 లక్షల మందికి పైగా మార్స్ పైకి ఏదో ఒక రూపంలో వెళ్లనున్నారు
అవకాశం వస్తే అంతరిక్ష ప్రయాణం చేయాలని చాలామందికే ఉంటుంది. ఇక అంగారక గ్రహంపైన అయితే ఏకంగా అక్కడే నివసించాలని చాలా మంది ఇళ్లు కూడా రిజర్వు చేసుకున్నారు. మార్స్ మీదికి మనిషిని పంపడం అనే కల ఎప్పటికి నెరవేరుతుందో ఇదమిత్థంగా తెలియనప్పటికీ, కొంతమంది పేర్లను మాత్రం మార్స్ గ్రహంపైకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అమెరికా అంతరిక్షపరిశోధనా సంస్థ 'నాసా' డిసెంబర్ 4న 'ఓరియన్' అనే అంతరిక్ష నౌకను మార్స్ పైకి పంపనుంది. ఈ నేపథ్యంలో ఔత్సాహికుల పేర్లను కూడా అరుణగ్రహంపైకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు చేయాల్సిందల్లా నాసా అధికారిక వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవడమే. నమోదు చేసుకున్న పేర్లను నాసా ఓ మైక్రోచిప్ లో లోడ్ చేసి 'ఓరియన్' ద్వారా మార్స్ పైకి పంపుతుంది. ఈ వెసులుబాటు అక్టోబర్ 31లోగా నమోదు చేసుకున్న వారికేనని నాసా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 8 లక్షల మంది ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకోగా, వీరిలో 30 వేల మంది భారతీయులు ఉన్నారని నాసా తెలిపింది.