: జయకు ఇచ్చింది సాధారణ బెయిలే!: సుబ్రహ్మణ్య స్వామి


ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితకు షరతులతో కూడిన సాధారణ బెయిల్ నే సుప్రీంకోర్టు ఇచ్చిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అందుకే తానూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. కోర్టు బెయిల్ ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో జయ తరపున ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారని తెలిపారు. జయకు, ఆమె సహచరులకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలా? వద్దా? అనే విషయంపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దాదాపు 35వేల పత్రాలను డిసెంబర్ 18లోగా కర్ణాటక హైకోర్టుకు సమర్పించాలని, అలా చేయకపోతే జయ బెయిల్ రద్దవుతుందని స్వామి వివరించారు. బెయిల్ కూడా ఆ తేదీ వరకే అమల్లో ఉంటుందన్నారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ పై కర్ణాటక హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సుబ్రమణ్యస్వామి తెలిపారు. అంతేగాక, కర్ణాటక హైకోర్టు విచారణపై ఎలాంటి వాయిదా కోరకూడదన్నారు. జయకు అనారోగ్య కారణాలవల్లే బెయిల్ ఇచ్చినందున డిసెంబర్ 18 వరకు ఆమె ఇంట్లోనే ఉండాలని, అలాగే సందర్శకులెవరినీ కలవకూడదని కోర్టు షరతులు విధించినట్లు వెల్లడించారు. అటు, బెయిల్ ఇచ్చాక తమిళనాడులో ఎలాంటి హింస జరగబోదని, జడ్జిల గురించి గానీ, వేరెవరి గురించి అయినా గానీ వ్యాఖ్యలు చేయబోరని నారిమన్ కోర్టుకు హామీ ఇచ్చినట్లు స్వామి పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటన జరిగినా, తనపై దాడి జరిగిందని సుబ్రహ్మణ్యస్వామి చెప్పినా వెంటనే బెయిల్ రద్దవుతుందని కోర్టు చెప్పిందన్నారు.

  • Loading...

More Telugu News