: చోరీ చేసి 'సారీ' అంటూ నోట్ రాశారు
దొంగల్లో నిజాయతీ ఉంటుందా? ఉంటే, దొంగతనాలెందుకు చేస్తారంటారా? ఆ విషయాన్నొదిలేస్తే... మధ్యప్రదేశ్ లోని నవ్రోజాబాద్ లో అక్టోబర్ 12న ఓ దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు తమ పని ముగించుకుని కౌంటర్ లో ఓ లేఖను వదిలి వెళ్ళారు. తాము బలవంతంగానే ఈ చోరీ చేయాల్సి వచ్చిందని, పోలీసులకు వారానికింత అని చెల్లిచేందుకు దొంగతనాలు తప్పడం లేదని, తమను క్షమించాలని హిందీలో రాశారు. తాము ఇలా చోరీలకు పాల్పడడానికి కారణం సబ్ ఇన్ స్పెక్టర్ రమాకాంత్ పాండే, కానిస్టేబుళ్ళు రాహుల్ విశ్వకర్మ, ఆకాశ్ దాస్ లేనని లేఖలో తెలిపారు. వారికి ప్రతివారం సొమ్ము ముట్టజెప్పకపోతే అరెస్టు చేసి జైల్లో పెడతామని బెదిరిస్తారని వివరించారు. మరో మార్గం లేకే ఈ షాపులో దొంగతనం చేశామంటూ 'సారీ' చెప్పారు. కాగా, దొంగతనం జరిగిన మరుసటి రోజు ఉదయం షాపు యజమాని రాజా వశ్వాని షట్టర్ తెరిచి చూడగా, చోరీ జరిగిన విషయం తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి పరిశీలించారు. ఇది ఒక్కడి పనికాదని, ఓ గ్యాంగు ఇందులో పాల్గొని ఉంటుందని పేర్కొన్నారు. రూ.25,000 నగదు, కిరాణా వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. కాగా, దొంగలు తమ లేఖలో పేర్కొన్న ముగ్గురు పోలీసులు స్పందించేందుకు అందుబాటులో లేరు.