: రాష్ట్రంలో ఎక్కడైనా పుస్తకావిష్కరణ సభ నిర్వహిస్తాం: పరకాల
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని గుర్తు చేస్తూ, విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్, రాష్ట్రంలో పుస్తకావిష్కరణ సభ ఎక్కడైనా నిర్వహించే హక్కు తమకుందని వ్యాఖ్యానించారు. 'రుజువులు లేని ఉద్యమం' పుస్తకావిష్కరణ సభపై తెలంగాణ వాదులు దాడి చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ వాదనను ఎదుర్కొనే శక్తి లేకే సభపై దాడి చేశారని పరకాల విమర్శించారు.
వారు చేస్తోన్న ఉద్యమం 'విశాలాంధ్ర' వాదనను తట్టుకోలేనంత బలహీనంగా ఉందని దీన్నిబట్టి అర్థమవుతోందని పరకాల ఎద్దేవా చేశారు. భౌతికంగా దాడులు చేసే స్థాయికి వెళుతున్నారంటే, వారు ఈ పుస్తకం పట్ల ఎంత భయపడుతున్నారో తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం ప్రజాబాహుళ్యంలోకి వెళితే వారిని ఊళ్ళల్లోకి రానివ్వరని అర్థమయ్యే ఈ దాడులు అని ఆరోపించారు.