: పసిపాపలా హాయిగా నిద్రపోయేందుకు చిట్కాలివిగో!
ప్రస్తుత కాలంలో వ్యక్తులు విశ్రాంతి తీసుకునే సమయం తగ్గిపోతోంది. బిజీ లైఫ్, ఒత్తిళ్ళు ఇలా ఎన్నో అంశాలు వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోయేందుకు తగిన సమయం దొరక్క ఇబ్బంది పడుతుంటారు కొందరు. మరికొందరు పడుకున్నా నిద్ర రాక, అటూ ఇటూ దొర్లుతుంటారు. కంటినిండా నిద్రతోనే అందమైనా, ఆరోగ్యమైనా! శిశువులను చూడండి, వారు ఎంతో హాయిగా నిద్రపోతారు. అలాంటి గాఢ నిద్ర మీకూ కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. నిద్ర పోయేందుకు ఫిక్స్ డ్ టైం పెట్టుకోవాలి. దీనర్ధం, ప్రతి రోజూ ఒకే సమయంలో పడకపైకి చేరాలని కాదు. నిద్రవేళకు పడుకోవాలంతే. తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం సరికాదు. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల విరామం ఉండేట్టు చూసుకోవాలి. పడుకునే ముందు స్నానం చేస్తే మరీ మంచిది. నిద్ర లేవడం కూడా ఫిక్స్ డ్ టైం పద్ధతిలోనే అలవాటు చేసుకోవాలి. చక్కగా నిద్ర పోగలిగితే ఇక ప్రతి రోజూ అలారంతో పని లేకుండా అదే సమయంలో మెలకువ వచ్చేస్తుంది. సాయంత్రం వేళల్లో కాసింత ఒళ్ళు వంచగలిగితే శరీరం అలసినట్టవుతుంది. వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ మెరుగవుతుంది. నిద్ర చక్కగా వస్తుంది. నిద్రకు ముందు పుస్తకాలు చదవడం చాలా మందికి హాబీ. తద్వారా, నిద్ర ఆలస్యం అవుతుంది. వారు పుస్తకాలు చదవాలనుకుంటే ఏ చైర్లోనో కూర్చుని పూర్తి చేసేయాలి. పడక మీదికి పుస్తకం తేకూడదు. రాత్రివేళల్లో లైటు ఉంటేనే కొందరు నిద్రపోతారు. అలాంటి వారు రూల్సు బ్రేక్ చేయాలి. లైట్లు ఆర్పేసి పడుకోవడం అలవాటు చేసుకోగలితే సుఖ నిద్ర సొంతం చేసుకుంటారు. బెడ్ పై స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్లు వంటి వాటికి స్థానం కల్పించకూడదు. నిద్రవేళ సంగీతం వినడం కూడా మంచి అలవాటు కాదు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. బెడ్ పై ఉండాల్సింది దుప్పట్లు, దిండ్లే. ఇతర వస్తువులకు పడక మీద చోటివ్వకూడదు. కాఫీకి దూరంగా ఉండాలి. అందులో ఉండే కెఫీన్ నిద్ర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి.