: మీ పిల్లలు తగవులాడుకుంటున్నారా.... అయితే, ఇలా చేయండి!


కొందరు పిల్లలు ప్రతి దానికి మారాం చేస్తుంటారు. అది కావాలి, ఇది కావాలి అంటూ తోబుట్టువులతో గొడవలు పెట్టుకుంటారు. పిల్లల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. అలా కాకుండా, పిల్లల్లో ఆరోగ్యకరమైన అనుబంధం పెంపొందించేందుకు 6 మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 1. రెండో సంతానం గర్భంలో ఉండగానే, తొలి సంతానాన్ని ఈ విషయమై సన్నద్ధం చేయాలి. కుటుంబంలో కొత్తగా రాబోయే వ్యక్తితో మున్ముందు ఎలా మెలగాలో విడమర్చాలి. 2. ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు? అన్న విషయాన్ని పిల్లలకు స్పష్టంగా తెలియజెప్పాలి. గొడవపడుతున్న పిల్లలను కూర్చోబెట్టి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. బాహాబాహీ తలపడడం, ఒకరి వస్తువులను మరొకరు దొంగిలించడం వంటి పనులను ఉపేక్షించరాదు. 3. పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చకూడదు. పెద్దబ్బాయి అన్నం తింటూ చొక్కాపై పడేసుకున్నాడనుకోండి, అప్పుడు, నీ చెల్లెలు నీకంటే నయం అంటూ పోలిక పెడితే, అది వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 4. స్పర్థ ఒక్కోసారి అసూయగా పరిణమిస్తుంది. చిన్నవారిని బాగా చూస్తున్నారని, తమను బాగా చూడడంలేదని కొన్నేసి సార్లు పెద్ద పిల్లలు భావిస్తుంటారు. అలాంటి భావనలు పిల్లల్లో కలగనీయకుండా వారిని సమానంగా చూడాలి. 5. ఒక్కోసారి టీవీ కోసమో, సైకిల్ తొక్కడం కోసమో పిల్లలు పోటీ పడుతుంటారు. అలాంటప్పుడు వారి వారి గదుల్లోకి వెళ్ళమని సూచించాలి. ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో నిర్దేశించి, ఆ సమయంలో వారా పని చేసేట్టు చూడాలి. చిన్ననాటి నుంచే ఒకరితో ఒకరు వస్తువులను షేర్ చేసుకోవడాన్ని ప్రోత్సహించాలి. 6. పిల్లలు గొడవ పడుతున్నారు కదా అని ప్రతిసారి జోక్యం చేసుకోవడం సరికాదు. పరిస్థితి చేయి దాటి పోతుందనుకున్న స్థితిలోనే మనం జోక్యం చేసుకోవాలి.

  • Loading...

More Telugu News