: నిరసనకారులపై పెప్పర్ స్ప్రే చల్లిన హాంకాంగ్ పోలీసులు
ప్రధాన రహదారిని బ్లాక్ చేసి తీవ్ర ఆందోళన చేస్తున్న ప్రొ డెమోక్రసీ సివిక్ పార్టీ నిరసనకారులను ఆపేందుకు హాంకాంగ్ పోలీసులు పెప్పర్ స్ప్రే చల్లారు. అంతకుముందు రోజు ఆ పార్టీ సభ్యుడు కెన్ త్సాంగ్ కిన్-చియును పోలీసులు కొట్టారు. దాంతో, సివిక్ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. తమ పార్టీ నేతపై చేయిచేసుకున్నందుకుగానూ ఫిర్యాదు చేసేందుకు ఈ రోజు స్థానిక వాన్ ఛాయ్ జిల్లాలోని పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట వందలమంది గుమికూడారు. ఈ క్రమంలోనే వారిని అదుపుచేసేందుకు పెప్పర్ ఉపయోగించడంతో, ఆ వ్యవహారం టీవీల్లో ప్రసారమైంది. అటు, వెంటనే చైనా బీబీసీ వెబ్ సైట్ ను బ్లాక్ చేసింది. "ఒక దేశం, రెండు వ్యవస్థలు" కింద ప్రత్యేక పాలనా ప్రాంతమైన హాంకాంగ్ ను చైనా పాలిస్తోంది. ఇది ఇష్టంలేని పలువురు మూడు వారాల నుంచి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రస్తుతం హాంకాంగ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.