: తమిళ కవిని వరించిన సింగపూర్ అత్యుత్తమ సాంస్కృతిక పురస్కారం
భారత సంతతి కవి కేటీఎం ఇక్బాల్ (74) సింగపూర్ అత్యుత్తమ సాంస్కృతిక అవార్డుకు ఎంపికయ్యారు. సింగపూర్ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్ ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇక్బాల్ 1951లో భారత్ నుంచి సింగపూర్ తరలివెళ్ళారు. అప్పుడాయన వయసు 11 సంవత్సరాలు. కాలక్రమంలో సాహితీ సేద్యం మొదలుపెట్టిన ఇక్బాల్ 1970-80 మధ్య కాలంలో రేడియో సింగపూర్ కోసం 200కి పైగా బాలల గేయాలు రచించారు. ఏడుకు పైగా సాహిత్య సంకలనాలు వెలువరించారు. ఈ అవార్డుకు ఎంపికవడం పట్ల ఆయన స్పందిస్తూ, ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన తొలి ప్రాధాన్యత సాహిత్యమేనని, దానితో 60 ఏళ్ళుగా సహవాసం చేస్తున్నానని పేర్కొన్నారు.