: బంగాళాదుంపల కోసం బెంగాల్ సీఎంకు మూడుసార్లు ఫోన్ చేశా: చంద్రబాబు


బాధితులను ఆదుకోవడాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలోని కార్పొరేట్ సంస్థలు బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. టాటా, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయని వెల్లడించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు. తాగునీరు, విద్యుత్, ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని బాబు తెలిపారు. బంగాళాదుంపల కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ చేశానని చెప్పారు. పూర్తిగా సహకరిస్తామని ఆమె తెలిపారని అన్నారు. లీటరు పాలను రూ. 10 తగ్గించి అమ్మాలని హెరిటేజ్, విశాఖ డైరీలను ఆదేశించానని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 15 రోజులు పడుతుందనుకున్న విద్యుత్ సమస్యను మూడు రోజుల్లోనే దారిలోకి తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈరోజు విశాఖలో అరగంట పాటు నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకు రావడం సంతోషం కలిగించిందని తెలిపారు. త్వరలోనే విశాఖకు పూర్వ వైభవం తీసుకొస్తామని... నిర్మాణ రంగంలో నిపుణులైన వారిని అమెరికా నుంచి రప్పిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News