: అమెరికాలో ఎబోలా కేసులు.... మన సన్నద్ధతపై సందేహాలు
అమెరికాలో రెండో ఎబోలా కేసు నమోదైన సంగతి తెలిసిందే. మెరుగైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న అగ్రరాజ్యంలోనే ఈ మహమ్మారి ఉనికి చాటుకున్నప్పుడు, భారత్ వంటి దేశాల్లో అది భారీ స్థాయిలో విరుచుకుపడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎబోలాను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సన్నద్ధత అంతంత మాత్రమేనంటున్నారు. ఇతర దేశాల మాదిరే పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ చేస్తున్నా, అది ఎంతటి ప్రభావవంతమైన ఫలితాలనిస్తుందన్నదానిపై స్పష్టత లేదు. భారత ఆరోగ్య వ్యవస్థ పనితీరును దృష్టిలో పెట్టుకుని చూస్తే ఎబోలా భారీ జననష్టం కలిగించే అవకాశాలే ఎక్కువ. సాధన సంపత్తి లేమి, సిబ్బంది కొరత, నాసిరకం సదుపాయాలు, అనారోగ్యకర పరిస్థితుల నేపథ్యంలో... ప్రస్తుతం నెలకొన్న స్థితిగతులకు ఎబోలా తోడైతే దేశం తీవ్ర విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2010లో వరల్డ్ బ్యాంక్ సేకరించిన సమాచారం మేరకు భారత్ లో సగటున ప్రతి 1000 మందికి ఒకే నర్స్ ఉండగా, అదే, అమెరికాలో ప్రతి 1000 మందికి 10 మంది నర్సులు ఉన్నారట. ఎబోలా వంటి వైరస్ లను గుర్తించేందుకు దేశంలో రెండే ల్యాబ్ లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ కాగా, మరొకటి పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనగలమని అంటున్నారు. ఉదాసీనతకు తావివ్వరాదని, అన్ని విధాలా సన్నద్ధమవ్వాలని అధికారులకు సూచించారు. ఎబొలా ప్రభావిత దేశాల్లోని భారత ఎంబసీల వద్దే తొలుత ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాలకు, ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు.