: నేటి రాజకీయనేతలు తప్పక తెలుసుకోవాల్సిన ఘటన ఇది
ఈటీవీలో ప్రసారమయ్యే 'అంతర్యామి' కార్యక్రమంలో 'బ్రహ్మశ్రీ' చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఎంతో అర్థవంతంగా ఉంటాయి. బుధవారం నాటి కార్యక్రమంలో ఆయన అసూయ గురించి వివరిస్తూ ఓ సంఘటనను వీక్షకులతో పంచుకున్నారు. నేటి రాజకీయనేతలు తప్పక తెలుసుకోవాల్సిన ఘటన ఇది. దాని వివరాలు చాగంటివారి మాటల్లోనే విందాం. "అప్పట్లో చదువుకునే రోజుల్లో నేను విశాఖపట్నంలో ఓ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్నాను. అవి ఎన్నికల రోజులు. దిగ్గజాలు ద్రోణంరాజు సత్యనారాయణ, తెన్నేటి విశ్వనాథం బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా వారిద్దరూ కాకతాళీయంగా నేనున్న చోటుకే వచ్చారు. ఎన్నికల్లో సత్యనారాయణగారే గెలిచే అవకాశాలున్నాయని అందరూ అనుకుంటున్నారు. అయినాగానీ, విశ్వనాథం గారు తన కారు దిగి సత్యనారాయణ వద్దకు వచ్చి 'ఏంట్రా, ఆ ముఖం ఏంటి? ఎంత నల్లగా పోయిందో చూడు! ఎందుకంతలా ఎండలో తిరిగేస్తున్నావు. గెలిస్తే ఐదేళ్ళే కదా మనం పదవిలో ఉండేది. కానీ, ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎక్కువగా తిరగొద్దు' అని సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడమే కాదు, అప్పటికప్పుడు తన కార్లోంచి మజ్జిగ తెప్పించి ఇచ్చారు సత్యనారాయణకు. అప్పుడు సత్యనారాయణ గారు 'నేను మిమ్మల్ని ఆశీర్వచనం అడగ కూడదు' అంటూనే విశ్వనాథం గారి కాళ్ళపై పడి గెలవాలని ఆశీర్వదించమని కోరారు. దీనికి విశ్వనాథం గారు 'ఒరేయ్, నువ్వు గెలిచినా నేను గెలిచినా అందరికీ కావాల్సింది ప్రజల క్షేమమేరా, తప్పకుండా గెలువు, విజయీభవ' అంటూ ఆశీర్వదించారు" అని చాగంటివారు ఆ నాటి ఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. అసూయలేనితనానికి విశ్వనాథంగారి వైఖరే నిదర్శనమని చెప్పారు. అందరూ అసూయకు దూరంగా ఉండాలని సూచించారు. మరి నేటి తరం నేతలు ఈ సూచనను పాటిస్తారా?