: విసిగిస్తున్నారని పేషెంట్లను చంపేసిన నర్స్!
ఇటలీలో ఓ నర్స్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తనను విసిగిస్తున్నారంటూ 38 మంది రోగులను చంపేసినట్టు తెలుస్తోంది. డానియేలా పొగ్గియాలి (42) అనే నర్స్ లూగో పట్టణంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇదే ఆసుపత్రిలో 78 ఏళ్ళ రోసా కాల్డెరోని అనే మహిళ చికిత్స పొందుతూ ఏప్రిల్ 8న మరణించింది. కాల్డెరోని నర్స్ డానియేలా పర్యవేక్షణలో ఉన్నప్పుడే ప్రాణాలు విడిచింది. డానియేలా ఓవర్ డోస్ తో ఓ ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగానే రోగి మరణించిందని ఆసుపత్రి సిబ్బంది కూడా అంటున్నారు. కాల్డెరోని శరీరంలో అధికస్థాయిలో పొటాషియం ఉన్నట్టు పోస్టుమార్టంలో తేలింది. అంతకుముందు కూడా కొందరు పేషెంట్లు ఇలాంటి పరిస్థితుల్లోనే మరణించారు. చనిపోయిన పేషెంట్లు డానియేలా పర్యవేక్షణలోని వారే కావడంతో సందేహాలు మరింత బలపడ్డాయి. తనను అదేపనిగా విసిగిస్తున్నందునే పొటాషియంను అధిక మోతాదులో ఇంజెక్ట్ చేసి వారిని శాశ్వతంగా నిద్రపుచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, పోలీసులు డానియేలాను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కాగా, ఎవరైనా పేషెంట్లు సతాయిస్తుంటే వారి విషయం తనకు వదిలివేయమని, వారి సంగతి తాను చూసుకుంటానని ఓ కొలీగ్ తో చెప్పిందట ఈ కిల్లర్ నర్స్!