: జెట్ ఎయిర్ వేస్ కు పైలట్లు కావలెను!
దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ కు తక్షణమే పైలట్లు కావాలట. అవును మరి, విమానాలైతే ఉన్నాయి కాని, తగినంత మంది పైలట్లు లేరు. అదేంటీ, విమానాలు కొన్న జెట్ ఎయిర్ వేస్, పైలట్లను నియమించుకోలేకపోయిందా? అంటే, ఎందుకు నియమించుకోలేదు. తక్కువ వేతనానికే పనిచేస్తారన్న ఉద్దేశంతో లైసెన్సులు కూడా లేని పైలట్లను నియమించుకుంది. తీరా విషయాన్ని గ్రహించిన డీజీసీఏ సదరు పైలట్లను విధుల్లో నుంచి తొలగించింది. దీంతో ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ లో పైలట్ల కొరత తీవ్రంగా ఉందట. ఎంతగానంటే ఆది, సోమవారాల్లో దాదాపు 150 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచేంతగా! మరోవైపు జెట్ లైఫ్ లో పైలట్ శిక్షణ పొందుతున్న భావి పైలట్లు యాజమాన్యం వైఖరిపై గుర్రుగా ఉన్నారట. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ మరింత మేర పైలట్ల కొరతను ఎదుర్కోనుంది.