: ముందుచూపువల్లే ప్రాణనష్టాన్ని తగ్గించాం: చంద్రబాబు


హుదూద్ తుపాను సంభవిస్తుందన్న నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తలు, ముందుచూపువల్లే ప్రాణనష్టాన్ని చాలావరకు తగ్గించగలిగామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో తుపాను నష్ట నివారణకు తీసుకున్న చర్యలపై అన్ని రాష్ట్రాలకు బ్లూప్రింట్ లు పంపుతామని చెప్పారు. మొన్న, నిన్నటి కంటే ఇవాళ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందన్నారు. విశాఖ కలెక్టరేట్ లో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తుపాను తర్వాత రెండు రోజులకే విశాఖ వాసులకు తాగునీటిని అందించామన్నారు. అటు చౌక దుకాణాల్లో అందరికీ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయని, విశాఖలో ప్రతి పౌరుడు చౌక దుకాణాల్లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చన్నారు. ప్రస్తుతం నగరంలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్న సీఎం, రాత్రివేళ స్వయంగా పర్యవేక్షించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. ఇక చాలాచోట్ల సెల్ ఫోన్ సిగ్నళ్ల పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. అటు తుపాను సహాయక చర్యలపై హైదరాబాదులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విశాఖలో పది మురికివాడల్లో వైద్య శిబిరాలు పెట్టినట్లు చెప్పారు. 9 లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు, చేనేత, మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News