: శాన్వీ హంతకుడికి మరణశిక్ష, అమెరికా కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో సంచలనం రేపిన చిన్నారి శాన్వీ, ఆమె నానమ్మ సత్యవతిల హత్య కేసులో యండమూరి రఘునందన్ కు మరణ శిక్ష విధిస్తూ అమెరికా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2012, అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో జరిగిన ఈ దారుణంలో చిన్నారి శాన్వీ, ఆమె నానమ్మ సత్యవతిలు వారి సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. వారిద్దరినీ హత్య చేసింది తానేనని తొలుత అంగీకరించిన రఘునందన్, ఆ తర్వాత మాట మార్చాడు. కేవలం దొంగతనం మాత్రమే చేశానని, హత్యలతో తనకు సంబంధం లేదని కోర్టుకు చెప్పాడు. ఇద్దరు అమెరికన్ పౌరులు తనను బెదిరించి, శాన్వీ, సత్యవతిలను హత్య చేశారని బుకాయించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మారింది. కేవలం డబ్బు కోసమే రఘునందన్ జంట హత్యలకు పాల్పడ్డాడని ఈ నెల 9న కోర్టు నిర్ధారించింది. కేసులో దోషిగా తేలిన రఘునందన్ కు మరణ శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.