: బెంబేలెత్తుతున్న తెలంగాణ విద్యుత్ సంస్థలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ మొదటి వారంలో విద్యుత్ కొరత కేవలం 3.49 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండగా... సెప్టెంబర్ 23వ తేదీకి 10.86 మిలియన్లకు పెరిగింది. సెప్టెంబర్ 27వ తేదీకి విద్యుత్ లోటు 20 మిలియన్ యూనిట్లను దాటింది. సెప్టెంబర్ 29వ తేదీకి 32 మిలియన్ యూనిట్లకు చేరింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వచ్చి ఈ నెల 12వ తేదీకి 29.79 మిలియన్ యూనిట్లకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగి 42 మిలియన్ యూనిట్లకు లోటు పెరిగింది. దీంతో విద్యుత్ సంస్థలు షాక్ కు గురయ్యాయి. ఒక్క సారిగా ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందో అధికారులకు అర్థం కావడం లేదు. ఇప్పటికే, తెలంగాణలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలకు రోజుకు 4 గంటల విద్యుత్ సరఫరా మాత్రమే జరుగుతోందని సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు మరింత అంధకారంలోకి జారిపోతుందని విద్యుత్ సంస్థలు భయపడుతున్నాయి. దీనికి తోడు, హుదూద్ తుపాను ప్రభావంతో సింహాద్రి పవర్ ప్లాంటులో 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో, తెలంగాణకు రావాల్సిన 560 మెగావాట్ల విద్యుత్ కు ఆటంకం ఏర్పడింది. ఈ పరిణామం... మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ విధంగా తయారయింది. విద్యుత్ కు డిమాండ్ భారీగా పెరుగుతుండటం... విద్యుత్ లోటు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటంతో... సాగర్, శ్రీశైలం కేంద్రాల్లో పూర్తి స్థాయి విద్యుదుత్పాదనకు టీఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.