: మరోసారి వార్తల్లో దేవయాని ఖోబ్రగడే!


అమెరికాలో అరెస్టై సంచలనం రేపిన ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. విదేశాంగ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న దేవయాని, ఆ శాఖ అనుమతి లేకుండా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సదరు ఇంటర్వ్యూలో, అమెరికాలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఆమె ప్రముఖంగా ఫ్రస్తావించారు. దీంతో ఆమెపై విదేశాంగ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలో దేవయాని అరెస్ట్ సందర్భంగా భారత్-అమెరికాల మధ్య దౌత్యపరమైన యుద్ధం నడిచింది. ఒకానొక సందర్భంలో ఇరు దేశాలు తమ రాయబారులను వెనక్కి పిలిచేందుకు కూడా సిద్ధపడ్డాయి. అయితే నాడు ఆ సమస్య ఎలాగోలా సమసిపోయింది. తాజాగా ఇదే విషయాన్ని మరోమారు టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించడంతో రెండు దేశాల మధ్య తిరిగి వివాదం రేగుతుందేమోనని భావిస్తున్నారు. మరోవైపు విదేశాంగ శాఖలో పనిచేస్తున్న అధికారులు మీడియాతో మాట్లాడే ముందు ఆ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే దేవయాని ఎలాంటి అనుమతి తీసుకోలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. దీంతో దేవయాని, విదేశాంగ శాఖ నియమ నిబంధనలకు తూట్లు పొడిచి, ఇంటర్వ్యూ ఇచ్చినట్లేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక చర్యల విషయంపై ఆయన నోరు విప్పకున్నా, దేవయాని కఠిన పరిణామాలనే ఎదుర్కొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భారత్-అమెరికాల మధ్య ఇప్పుడిప్పుడే మంచి సంబంధాలు నెలకొంటున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య దూరం పెరిగేలా వ్యవహరించిన దేవయానిని మోడీ ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించబోదని విశ్లేషకులు వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News