: ఇదీ ఆంధ్రుల గొప్పమనసు!
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులు ప్రకృతి విలయతాండవం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలను హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. రాష్ట్రంలోని ఓ భాగం దుస్థితిని టీవీ చానెళ్లలో చూసిన ఇతర ఆంధ్రా జిల్లాల ప్రజలు ఆవేదన చెందారు. అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రలో మునుపెన్నడూ లేని బీభత్సాన్ని చూసి చలించిపోయారు. దీంతో వ్యక్తులు, సంస్థలు, ఊళ్లకు ఊళ్లు సహా సహాయం చేసేందుకు తరలుతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తోచిన సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కూరగాయలు తీసుకుని మనసున్న మారాజులు బయల్దేరారు. అలాగే గోదావరి జిల్లాల నుంచి బియ్యం, పాలు సరఫరా చేసేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విశాఖ వాసులకు సురక్షిత నీరు అందించేందుకు మరిన్ని సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం చూడకుండా, తమ తోటి వారికి సాయం చేసేందుకు ప్రజలే స్వచ్ఛందంగా వస్తుండడంతో ఇక్కట్లలో పడ్డవారు కాస్త ధైర్యం తెచ్చుకుంటున్నారు.