: వ్యతిరేక ప్రచారాన్ని పట్టించుకోను... రేపటి నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటా: డాలర్ శేషాద్రి
ఇటీవలే హృద్రోగ సమస్య కారణంగా ప్రాణాపాయ స్థితి ఎదుర్కొన్న టీటీడీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) డాలర్ శేషాద్రి కోలుకున్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, ఆపత్కాలంలో తనకు అండగా నిలిచిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కొందరు తనపై వ్యతిరేక ప్రచారం చేశారని, అలాంటి వాటిని పట్టించుకోనని అన్నారు. రేపటి నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటానని చెప్పారు. శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులతోనే తన ప్రాణాలు నిలిచాయని చెప్పుకొచ్చారు. ఇది తనకు పునర్జన్మ అని పేర్కొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా డాలర్ శేషాద్రి గుండెపోటుకు గురవడం తెలిసిందే.