: అమ్మకాల్లోనే కాదు... ఆఫీస్ విస్తీర్ణంలోనూ ఫ్లిప్ కార్ట్ అగ్రగామే!


ఫ్లిప్ కార్ట్ శరవేగంగా వృద్ధి సాధిస్తున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం. మొన్నటికి మొన్న ‘ద బిగ్ బిలియన్ డే’ సందర్భంగా కేవలం ఒకే రోజులో రూ.600 కోట్ల విలువైన ఆర్డర్లను కొల్లగొట్టి ప్రపంచ మార్కెట్ వర్గాలనే నివ్వెరపరచిన ఫ్లిప్ కార్ట్, తాజాగా కొత్త కార్యాలయంతోనూ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఇప్పటికే 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని లీజుకివ్వాలని ప్రతిపాదించిన ఫ్లిప్ కార్ట్, తాజాగా దానిని 30 లక్షల చదరపు అడుగులకు విస్తరించి మరీ ఇవ్వండంటూ ‘ఎంబసీ ఆఫీస్ పార్క్స్’ ను కోరింది. ఈ తరహా భారీ కార్యాలయాన్ని కలిగిన సంస్థగా ఫ్లిప్ కార్ట్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోనుంది. చదరపు అడుగుకు రూ.52ల అద్దెగా ఖరారైన ఈ ఒప్పందంపై ఫ్లిప్ కార్ట్ ఈ వారంలోనే సంతకం చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి తన సిబ్బంది సంఖ్యను 12 వేల నుంచి 25 వేలకు పెంచనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. కొత్తగా ఫ్లిప్ కార్ట్ అద్దెకు తీసుకోబోయే కార్యాలయంలో 30-50 వేల మంది పనిచేసే అవకాశముంది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు బెంగళూరులో కేవలం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం, ఫ్లిప్ కార్ట్ కొత్త కార్యాలయంలో పదో వంతు మాత్రమే ఉండటం గమనార్హం. మరోవైపు ఫ్లిప్ కార్ట్ తరహా భారీ కార్యాలయాన్ని భారత్ లో ఏ సంస్థ అయినా ఏర్పాటు చేయడం ఈ దశాబ్దంలోనే సాధ్యం కాదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News