: ఇక 'ఆండ్రాయిడ్' పైనా రైల్వే టికెట్ బుకింగ్
ఇప్పటివరకు విండోస్ ఆధారిత ఫోన్లు, బ్లాక్ బెర్రీ 10 డివైస్ లకే పరిమితమైన రైల్వే టికెట్ బుకింగ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ పైనా అందుబాటులోకి వచ్చింది. తాజాగా, ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఆండ్రాయిడ్ యాప్ ను లాంచ్ చేసింది. దీన్ని గూగుల్ ప్లే నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కు 'ఐఆర్సీటీసీ కనెక్ట్' అని నామకరణం చేశారు. అక్టోబర్ 9న ఆవిష్కరించిన ఈ యాప్ కు యూజర్లు 4.3/5 రేటింగ్ ఇచ్చారు. ఈ యాప్ ద్వారా యూజర్లు ఐఆర్సీటీసీ అకౌంట్ లోకి లాగిన్ అవడమే కాకుండా, సెర్చ్, టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిలేషన్ తదితర కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అంతేగాదు, దీని ద్వారా తత్కాల్ విధానంలోనూ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1, ఆపై వెర్షన్లపై పనిచేస్తుంది.