: ఆరోగ్యంగా ఉండాలనుకుంటే... 25 ఏళ్ల దాకా పెళ్లి మాటెత్తొద్దు: బీహార్ సీఎం ఉచిత సలహా
సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే 25 ఏళ్ల వయసు నిండే వరకు పెళ్లి చేసుకోకూడదట. ఇదేదో సాధువో, సన్యాసో చెప్పిన మాట కాదండి బాబూ... సాక్షాత్తు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ చెప్పిన మాట. 25 ఏళ్ల తర్వాత వివాహం చేసుకున్న కారణంగానే తాను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని, తన వాదనకు తననే ఉదాహరణగా చూపిస్తున్నారు ఆయన. యువతి, యువకులు 25 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటే అనారోగ్యానికి దూరంగా ఉండటమే కాక పోషకాహార లోపానికి చెక్ పడే అవకాశముందని కూడా ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో యువకులదే కాక యువతుల వివాహ వయసును కూడా 25 ఏళ్లకు పెంచితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాచీన కాలంలో అమలైన గురుకుల వ్యవస్థను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మనిషి జీవితాన్ని నాలుగు దశలుగా విభజించిన నాటి గురుకుల వ్యవస్థ 24 ఏళ్ల బ్రహ్మచర్యాన్ని, 24-48 ఏళ్ల దాకా గృహస్థాశ్రమాన్ని ప్రతిపాదించిందని ఆయన చెప్పారు. ఈ కారణంగానే నాడు మనిషి ఎత్తు ఏడడుగులుంటే, ప్రస్తుతం ఐదడుగులకు వచ్చిందన్నారు. మరి మాంఝీ చెబుతున్న 25 ఏళ్ల తర్వాత పెళ్లి, భారత్ లో ఎప్పుడు అమలులోకి వస్తుందో చూడాలి!