: సెబీ కొరఢాతో 26 శాతం పతనమైన డీఎల్ఎఫ్ షేర్ విలువ
షేర్ మార్కెట్ నుంచి మూడేళ్ల పాటు నిషేధానికి గురైన డీఎల్ఎఫ్ షేరు విలువ మంగళవారం భారీగా పతనమైంది. ఉదయం కేవలం గంటల వ్యవధిలోనే డీఎల్ఎఫ్ షేరు విలువ 26 శాతం మేర పడిపోయింది. దీంతో డీఎల్ఎఫ్ మదుపరులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. 2007లో తొలిసారిగా పబ్లిక్ ఆఫర్ కు వచ్చిన డీఎల్ఎఫ్, తన అనుబంధ కంపెనీలతో పాటు కంపెనీ ఎదుర్కొంటున్న కేసులను ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదని సీబీఐ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో డీఎల్ఎఫ్ తో పాటు సంస్థ ప్రమోటర్ కేపీ సింగ్ సహా ఆయన కొడుకు, కూతురు, మరో ముగ్గురు కంపెనీ ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు షేర్ మార్కెట్ నుంచి బహిష్కరిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళవారం మార్కెట్ ప్రారంభం కాగానే డిఎల్ఎఫ్ షేరు పతనం ప్రారంభమైంది. అయితే సంస్థలో ప్రమోటర్ల వాటా 75 శాతం ఉన్న నేపథ్యంలో ఈ పతనం ప్రభావం ప్రజలపై పెద్దగా ఉండదన్న వాదన వినిపిస్తోంది.