: మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేతే కింగ్ మేకర్ అవుతారంటున్న ఒపీనియన్ పోల్స్


మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేడి తీవ్రమైంది. సుదీర్ఘ మైత్రి విరమించుకున్న శివసేన, బీజేపీలు పరస్పరం కత్తులు దూస్తుండగా, వీర్ మరాఠా శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పోరుకు సై అంటోంది. ఒపీనియన్ పోల్స్ సంకీర్ణం తప్పదంటున్నాయి. హంగ్ పరిస్థితి ఏర్పడితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కింగ్ మేకర్ అవుతారని, ఆయన మద్దతే కీలకమవుతుందని రాజకీయ పరిశీలకులంటున్నారు. బీజేపీ పూర్తి మెజారిటీ సాధించడం కష్టమేనంటున్న ఒపీనియన్ పోల్స్, ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరిస్తుందని చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఎంఎన్ఎస్ నిలుస్తాయట. మొత్తం 288 సీట్లలో బీజేపీకి 110, కాంగ్రెస్ కు 68, శివసేనకు 52, ఎన్సీపీకి 39, ఎంఎన్ఎస్ కు 7, స్వతంత్ర అభ్యర్థులకు 12 సీట్లు వస్తాయని ఓ సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి మహారాష్ట్ర ఎన్నికల చిత్రంపై విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎక్కడా మద్దతిచ్చే పరిస్థితి లేదని, శివసేన కూడా తన నుంచి విడిపోయిన బీజేపీతో కలవడం అసాధ్యమేనని అన్నారు. ఎంఎన్ఎస్ కు వచ్చే సీట్లు అంతంత మాత్రమేనన్న ఆయన... పూర్తి మెజారిటీ రాని పక్షంలో బీజేపీకి కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ ఎన్సీపీయే అని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ కచ్చితంగా బీజేపీకి సహకరిస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News