: ఈ శీతాకాలంలో ఢిల్లీ నుంచి చిన్న నగరాలకు విమాన సర్వీసులుండవ్!
శీతాకాలంలో ఢిల్లీ మహానగరాన్ని పొగమంచు ఎలా కప్పేస్తుందో అందరికీ తెలిసిందే. దీని ప్రభావం ముఖ్యంగా రవాణా వ్యవస్థపై ఎక్కువ. రోడ్డుపై వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాల బారినపడుతుంటారు. విమానాల సంగతి సరేసరి. రన్ వే ఎక్కడుందో కూడా కనిపించనంత దట్టంగా ఆవరిస్తుంది పొగమంచు. దీంతో, సహజంగానే చలికాలంలో విమాన సర్వీసులు ఆలస్యమవుతుంటాయి. రానున్నది శీతాకాలం కావడంతో ఢిల్లీ నుంచి దేశంలోని చిన్న నగరాలు, పట్టణాలకు ఎయిర్ బస్ ఏ-320, బోయింగ్ 737 తరహా భారీ విమానాలను నిలిపివేయాలని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసిఏ) అన్ని విమానయాన సంస్థలకు సూచించింది. అత్యాధునిక ల్యాండింగ్ వ్యవస్థలు లేనటువంటి చిన్న విమానాలను కూడా డిసెంబర్ 14 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఢిల్లీ విమానాశ్రయంలో అనుమతించరు. చార్టర్డ్ విమానాలకు, ప్రైవేట్ జెట్ విమానాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.