: ఢిల్లీలోనూ ఎన్నికలకు సిద్ధం కండి: బీజేపీకి ఆరెస్సెస్ సూచన
దేశ రాజధాని ఢిల్లీలోనూ కొత్తగా ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సూచించింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తున్న తరుణంలో ఢిల్లీలోనూ ఆ పార్టీకి సానుకూల పవనాలే వీస్తాయని ఆరెస్సెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సుప్తచేతనావస్థలో (సస్పెన్షన్) వుంది. గడచిన ఎన్నికల ఫలితాల ఆధారంగానే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా సాగుతున్న బీజేపీ యత్నాలు ప్రజల్లో చెడు సంకేతాలను పంపుతాయని కూడా ఆరెస్సెస్ వాదిస్తోంది. సోమవారం ఢిల్లీలో ఆరెస్సెస్ సీనియర్లతో బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎన్నికల విషయంపై చర్చ జరిగింది. మహారాష్ట్ర, హర్యానాల్లో పార్టీ గెలుపు ఖాయంగానే కనిపిస్తున్న తరుణంలో ఢిల్లీలోనూ మెరుగైన ఫలితాలే వస్తాయని ఆరెస్సెస్ నేతలు వెల్లడించారు. అంతేకాక కొత్తగా ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ కూడా పెరుగుతుందని వారు బీజేపీ నేతలకు సూచించారు. ఆరెస్సెస్ సూచనతో ఢిల్లీలో కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకే బీజేపీ మొగ్గుచూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.