: ఉత్తరాంధ్రలో రేపటి నుంచి జగన్ పర్యటన... కొన్నాళ్ల పాటు అక్కడే మకాం!
హుదూద్ తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ రేపటి నుంచి పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు మీడియాకు తెలిపారు. జగన్ విమానం ద్వారా హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో ప్రయాణించి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళతారు. ఒక వేళ కారులో ప్రయాణించడానికి వీలు కాని చోట ఆయన ద్విచక్ర వాహనంపై వెళతారు. అది కూడా కుదరకపోతే కాలినడకన కూడా వెళ్లి ఆయన బాధితులను పరామర్శిస్తారని ధర్మాన తెలిపారు. తుపాను సహాయ కార్యక్రమాలు ముగిసి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకు జగన్ ఉత్తరాంధ్రలోనే ఉంటారని సమాచారం. జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.