: విశాఖలో ధనవంతులు కూడా కడు పేదవారిలాగా బ్రతుకుతున్నారు... హుదూద్ ఎఫెక్ట్!
విశాఖ వాసులు ప్రస్తుతం తీవ్ర అయోమయంలో ఉన్నారు. ధనవంతులు కూడా కడు పేదవారి లాగా చేతిలో డబ్బులు లేక అల్లాడుతున్నారు. హుదూద్ తుపాను కారణంగా గత కొన్ని రోజులుగా విశాఖలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో, ఏటీఎమ్ లు పనిచేయడం లేదు. ఏటీఎమ్ లు వచ్చిన తర్వాత దేశంలోని అన్ని నగరాల ప్రజల్లాగే విశాఖ వాసులు కూడా ఇంట్లో పెద్దగా నగదు నిల్వలు ఉంచుకోవడం లేదు. దీంతో, బ్యాంకుల్లో డబ్బు ఉన్నప్పటికీ, అది చేతికి అందే వీల్లేక విశాఖ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరినైనా అప్పు అడుగుదామన్నా, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఒక వైపు చేతిలో డబ్బు కొద్ది మొత్తంలో మాత్రమే ఉండటం, మరో వైపు, నిత్యావసర వస్తువుల ధరలు రెండింతలు, మూడింతలు పెరగడం విశాఖ వాసులను క్షోభకు గురిచేస్తోంది. ఈ కారణంగా చాలా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెంట్ సరఫరాను పునరుద్ధరించడానికి, రవాణా వ్యవస్థను మాములు స్థితికి తీసుకురావడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఏటీఎమ్ ల్లో బ్యాంకులు క్యాష్ డిపాజిట్ చేసే పరిస్థితి కనపడటం లేదు. దీంతో, రాబోయే నాలుగైదు రోజులు ఎలా గడపాలో తెలియక సగటు విశాఖ వాసి తీవ్రంగా వేదన చెందుతున్నాడు.