: విశాఖలో ల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేస్తున్నాయి: పరకాల ప్రభాకర్


విశాఖలో 90 శాతం బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ విషయం చాలామందికి తెలియక ఆ ప్రాంతంలో ఉపయోగించుకోవడం లేదని, దయచేసి అందరూ ల్యాండ్ లైన్ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరోవైపు విశాఖలో 80 శాతం లైన్లు, టవర్లు దెబ్బతిన్నాయన్నారు. ఈ క్రమంలో సమాచార వ్యవస్థ పునరుద్ధరణ వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరకాల మాట్లాడుతూ పై విషయాలు వెల్లడించారు. అటు విశాఖలో సహాయక చర్యలకోసం ఉన్నతాధికారులతో కూడిన ఐదు బృందాలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే వారు బయలుదేరి వెళుతున్నారని వివరించారు. బాధితులకు విజయవాడ నుంచి 50 టన్నులు, రాజమండ్రి నుంచి మరో 50 టన్నుల ఆహారాన్ని తరలించినట్లు చెప్పారు. దాదాపు ఐదు లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని... తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 లీటర్ల కిరోసిన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ సలహాదారు తెలిపారు. తుపాను బాధితులకు సాయం చేసేందుకు విరాళాలు పంపుతామని చాలామంది అడుగుతున్నారని, ఇందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎస్ బీఐ ఖాతా 33913634404 నంబరుకి పంపాలని చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్టు పునరుద్ధరణ పనులు ఈ సాయంత్రానికి చాలా మటుకు పూర్తి అవుతాయని అధికారులు చెప్పారని, రోడ్ల పనులు కూడా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News