: విశాఖ వాసులకు ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తాం: నారాయణ
వైజాగ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించే అవకాశం లేకపోవడంతో... రాజమండ్రి నుంచి భారీ జనరేటర్లను తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ సాయంత్రంలోగా విశాఖలోని అన్ని రహదారులను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఫోన్ సేవలను కూడా త్వరితగతిన పునరుద్ధరించేందుకు టెలికాం ఆపరేటర్లతో మాట్లాడామని... సాయంత్రంలోగా చాలావరకు మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తుపాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని... విశాఖను పూర్వ స్థితికి తీసుకువస్తామని చెప్పారు.