: ఆహారాన్ని అందించడమే మొదటి లక్ష్యం... వైజాగ్ లో ప్యాకేజీ ప్రకటిస్తా: చంద్రబాబు
ప్రభుత్వం మొదటి కర్తవ్యం తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ఆకలి తీర్చడమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను తెప్పిస్తున్నామని వెల్లడించారు. సహాయక శిబిరాల్లో ఉన్న ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి వెంటనే 25 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, కేజీ పంచదార ఇస్తామని తెలిపారు. వైజాగ్ చేరిన తర్వాత తుపాను బాధితులకు ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రకటించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. తుపాను నష్టాన్ని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ సాయంత్రానికి 90 శాతం వరకు టెలిఫోన్ సేవలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ అధికారిని కేటాయించామని చెప్పారు. అంతేకాకుండా, సహాయక చర్యల కోసం సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నామని అన్నారు. ఒడిశా, తెలంగాణ పవర్ గ్రిడ్ ల నుంచి విద్యుత్ ను వాడుకుంటామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని... దాంతో త్వరలోనే సాధారణ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.