: మనిషి చనిపోయిన తర్వాత కొద్దిసేపు అన్నీ తెలుస్తాయట!


మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇది అనాదిగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న. గుండె ఆగిపోయిన మరుక్షణం ఆ మనిషికి ఇంకేమీ తెలివి వుండదు. ఇది డాక్టర్లు చెప్పే జవాబు. అయితే, దీనికి తాజాగా ఆశ్చర్యకరమైన జవాబు దొరికింది. సౌతాంప్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఓ వ్యక్తిని 'క్లినికల్లీ డెడ్' అని ప్రకటించిన తర్వాత కూడా, కొన్ని నిమిషాల పాటు అతని శరీరంలో 'చైతన్యం' ఉంటుందని తెలిపారు. మెదడు పూర్తిగా అచేతనంగా మారిపోయిన స్థితిలోనూ శరీరంలో కొంత 'కదలిక' ఉంటుందన్న విషయం అధ్యయనంలో తేలిందట. ఈ విషయమై నాలుగేళ్ళుగా 2000 మందికి పైగా కార్డియాక్ రోగులపై పరిశోధనలు సాగించారు. వారిలో మృత్యువు అంచులవరకు వెళ్ళిన దాదాపు 40 శాతం మంది తమ అనుభవాలను శాస్త్రవేత్తలతో పంచుకున్నారు. 'క్లినికల్లీ డెడ్' అన్న స్థితిలో తమకు ఓ రకమైన 'చైతన్యం' అనుభవంలోకి వచ్చిందని తెలిపారు. సరిగ్గా ఇలాంటి స్థితిని అనుభవించిన సౌథాంప్టన్ కు చెందిన 57 ఏళ్ళ సామాజిక కార్యకర్త... ఆ సమయంలో నర్సింగ్ సిబ్బంది చర్యలను, యంత్రాలు చేసే ధ్వనులను గుర్తించగలిగానని తెలిపారు. మరికొందరైతే ఏదో దివ్యకాంతి కనిపించిందని చెప్పుకొచ్చారు. ఇంకొందరికి అగాధంలోకి జారిపోతున్న ఫీలింగ్ కలిగిందట. మరికొందరైతే, తమ శరీరం నుంచి తాము వేరుపడి ఆ గదిలో ఓ మూలగా నిలబడి, అక్కడ జరుగుతున్న తంతును వీక్షించినట్టు చెప్పి శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేశారు. ఆ క్షణాలలో అక్కడ జరిగిన వైనాన్ని పూసగుచ్చినట్టు వారు వివరించి చెప్పడంతో ... అవి వాస్తవానికి సరిపోలడంతో శాస్త్రవేత్తలు 'ఏమిటీ మాయ?' అనుకుంటున్నారు. నాటింగ్ హాం ట్రెంట్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ సైకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ వైల్డ్ దీనిపై మాట్లాడుతూ, ఈ అధ్యయనం మరికొన్ని తాజా అధ్యయనాలకు ప్రోత్సాహాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News