: మలాలాకు కొత్త సమస్య!
నోబెల్ శాంతి బహుమతి విజేత, పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ (17) కు ఇప్పుడో విచిత్రమైన సమస్య వచ్చి పడింది! నోబెల్ అవార్డు ప్రదానం చేసే సమయంలోనే మలాలాకు స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. రెండూ ఒకేసారి రావడం పట్ల తాను కలత చెందుతున్నానని మలాలా పేర్కొంది. కాగా, ప్రతిష్ఠాత్మక నోబెల్ అవార్డు వచ్చినందుకు తనకన్నా టీచర్లే ఎక్కువగా ఆనందించారని తెలిపింది. అవార్డు ప్రకటించిన సమయంలో తన వద్ద సెల్ ఫోన్ లేదని, అప్పుడు కెమిస్ట్రీ క్లాసులో ఉన్నానని, అవార్డు విషయాన్ని కెమిస్ట్రీ టీచరే చెప్పిందని మలాలా వివరించింది. రెండేళ్ళ క్రితం పాక్ లో బాలికల విద్యా హక్కు కోసం పోరాటం సాగిస్తున్న తరుణంలో తాలిబాన్లు ఆమెపై కాల్పులు జరిపారు. ఆ దాడిలో తలకు తీవ్ర గాయాలు కాగా, లండన్ లో మెదడుకు సంబంధించిన ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం కోలుకున్న మలాలా ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.