: విశాఖలో హుదూద్ విలయం!
విశాఖ నగరంలో హుదూద్ తుపాను విలయం సృష్టించింది. ఆదివారం ఉదయం తన ప్రభావాన్ని ప్రారంభించిన హుదూద్, నగరాన్ని మునుపెన్నడూ లేని విధంగా అతలాకుతలం చేసింది. నగరంలోని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాని హుదూద్, మొత్తం నగరాన్ని కుదిపేసింది. హుదూద్ ప్రభావం కారణంగా నగరంలోని పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలు కూడా నేలమట్టమైనట్లు తెలుస్తోంది. తొలిరోజే భారీస్థాయిలో విధ్వంసం సృష్టించిన హుదూద్, మరో రెండు రోజుల పాటు నగరంపై విరుచుకుపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హుదూద్ విలయతాండవాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఈ తరహా విధ్వంసం గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. భారీ వ్యయంతో నిర్మించిన జోయాలుక్కాస్ తదితర వాణిజ్య సముదాయాలకు కూడా భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడిన నేపథ్యంలో వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్ ఫోన్లు మూగబోయాయి. సెల్ టవర్లు విరిగిపడినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో భవనాలు నేలకూలినట్లు సమాచారం.