: దేవేంద్ర పాఠక్... పాక్ తోకను కత్తిరించేశారు!


ఇండియన్ పోలీస్ సర్వీస్ సీనియర్ అధికారి దేవేంద్ర పాఠక్, పాక్ సైన్యం తోకను కత్తిరించేశారు. అసోం-మేఘాలయ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన పాఠక్, ప్రస్తుతం భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు యూపీఏ ప్రభుత్వం ఆయనను ఆ పదవిలో నియమించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు కూడా పాఠక్ ను ఆ పదవిలోనే కొనసాగిస్తోంది. కీలక పోస్టుగా పరిగణిస్తున్న ఈ పదవిలో నియమించేందుకు పాఠక్ కంటే మెరుగైన అధికారి మోడీకి కంటబడలేదట. భారత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు సాధారణమే అయినా, ఈసారి మరింత ఎక్కువయ్యాయి. దీంతో పాఠక్ నేరుగా సరిహద్దుకు చేరుకున్నారు. ఈ నెల 6 నుంచి మూడు రోజుల క్రితం దాకా అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు బీఎస్ఎఫ్ జవాన్లలో ధైర్యం నూరిపోశారు. ఇంకేముంది, బాస్ వెన్నంటి ఉండటంతో బీఎస్ఎఫ్ జవాన్లు మరింత ధైర్యంతో పోరాడారు. దీంతో, పాక్ భారీగా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మరికొన్ని రోజులు బీఎస్ఎఫ్ దాడులు కొనసాగితే పరిస్థితి ఏమిటి? ఈ భయమే పాక్ ను వణికించింది. అంతే, పాక్ తోక ముడవక తప్పలేదు. ఈ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకున్న క్రమంలోనే ‘‘పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. సరిహద్దు వద్ద సమాధానం చెప్పాల్సింది సైనికులు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ నింపాదిగా వ్యాఖ్యానించారు. అంటే, పాఠక్ సామర్థ్యంపై మోడీకి అంత నమ్మకమన్నమాట. ఇదిలా ఉంటే, బీఎస్ఎఫ్ చీఫ్ తో రక్షణ శాఖ మంత్రిగాని, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గాని మాట్లాడటం సహజం. అయితే ఈసారి ప్రధాని హోదాలో తొలిసారిగా మోడీ నేరుగా పాఠక్ తో మాట్లాడారట!

  • Loading...

More Telugu News