: విశాఖ ఎంతో సేఫ్... అయినా హుదూద్ ఎలా విరుచుకుపడబోతోంది?
భారతదేశ తూర్పు తీరంలో విశాఖపట్నం అత్యంత కీలకమైన నగరం. ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు విశాఖను అత్యంత సురక్షితంగా ఉంచుతున్నాయి. విశాఖలో తుపానులు తీరం దాటిన సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఈ నగర తీరాన ఎత్తయిన తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి నగరానికి అడ్డుగోడలా నిలుస్తూ... తుపానులు, వాయుగుండాలు తమ దిశ మార్చుకునేలా చేస్తున్నాయి. గత 18 ఏళ్లలో అనేక తుపానులు ఏర్పడినప్పటికీ... ఒక్కటంటే ఒక్క తుపాను కూడా విశాఖ దగ్గర తీరం దాటలేదు. అయితే, హుదూద్ తుపాను మాత్రం విశాఖనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. విశాఖ వద్ద తీరం దాటేందుకు భీకరంగా దూసుకువస్తోంది. మరి, ఎంతో సేఫ్ అన్న పేరున్న విశాఖ వద్ద హుదూద్ ఎలా తీరం దాటుతోంది? హుదూద్ ప్రత్యేకత ఏంటి? ఈ ప్రశ్నలు అందరి మదినీ తొలచక మానవు. టెక్నికల్ గా హుదూద్ విషయాన్ని చూస్తే... ఇది సముద్ర మట్టానికి తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో, తూర్పు కనుమలు అడ్డుగా ఉన్నా... హుదూద్ ను అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే, విశాఖ వద్ద హుదూద్ తీరం దాటేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు.