: ధ్యానంపై ఎన్నో అపోహలు...ఏది వాస్తవం? ఏది అవాస్తవం?


ధ్యానం అనగానే అది హిందువులు, సన్యాసులు, వృద్ధులు చేసే పని అంటూ ఎన్నో అపోహలు పేరుకుపోయాయి. ప్రధానంగా పది అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఈ అపోహల వల్ల చాలా మంది సాధన చేయడంలేదు. ఆ అపోహలేంటంటే. మెడిటేషన్ అంటే ఏకాగ్రత అనే అపోహ చాలామందిలో ఉంది. వాస్తవానికి ధ్యానం వల్ల ఏకాగ్రత కుదురుతుందే తప్ప మెడిటేషన్ అంటే ఏకాగ్రతే కాదు. మెడిటేషన్ అంటే మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రశాంతతనివ్వడం. ఇది ఓ క్రమపద్ధతిలో చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. అంతే తప్ప మెడిటేషన్ అంటే ఏకాగ్రతే కాదు. అలాగే ధ్యానం హిందూ మతంలో ఓ భాగం అనే అపోహ చాలా మందిలో పేరుకుపోయింది. దీంతో కేవలం హిందూ మత సంబంధీకులే ధ్యానం చేసేవారు. తాజాగా ధ్యానం విలువ తెలుసుకున్న పాశ్చాత్యులు సైతం ధ్యానంపై మక్కువ పెంచుకుని ఆచరిస్తున్నారు. మన దేశంలో మాత్రం ధ్యానం అనేది కేవలం హిందూ సిద్ధాంతం అనే ఆలోచన నుంచి చాలా మంది బయటపడలేకపోతున్నారు. ధ్యానం ఓ మతానికి సంబంధించినది కాదని, ప్రజలను, మతాలను, ప్రాంతాలను, దేశాలను ఏకం చేసే ప్రక్రియ అని ధ్యానాన్ని ఆచరించేవారు చెబుతున్నారు. అలాగే ధ్యానం కేవలం వృద్ధులు ఆచరించే కార్యక్రమమని యువతలో ఓ అపోహ బలంగా నాటుకుపోయింది. ధ్యానం ఎనిమిదేళ్ల వయసునుంచే ఆచరించగలిగే ప్రక్రియ. ధ్యానం ఆచరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఆలోచనలు స్వాధీనంలో ఉంటాయని, శరీరంపై అదుపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం చేయడం అంటే హిప్నాటిజం చేసుకోవడమనే అపోహ చాలా మందిలో ఉంది. ధ్యానం ఆచరించగలిగే వారు హిప్నాటిజానికి గురికారని నిపుణులు చెబుతున్నారు. హిప్నాటిజం చేసిన వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదని, యోగాలో ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుస్తుందని, శరీరం, మనసుపై పట్టు వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ధ్యానం అంటే ఆలోచనే అనే భావం చాలమందిలో ఉంది. అది సరికాదని ధ్యానం చేసేవారికి ఆలోచనపై అదుపు వస్తుందని, కేవలం యుక్తాయుక్త విచక్షణ తెలుస్తుందని, దాని వల్ల తాను చేసేది మంచో చెడో తెలుసుకునే స్థాయి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధ్యానం సమస్యల నుంచి పారిపోవడానికి మంచి ప్రక్రియ అనే భావం చాలా మందిలో కనిపిస్తుందని అది సరికాదని పెద్దలు చెబుతున్నారు. ధ్యానం సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినిస్తుందని, సమస్యకు సరైన స్పందనను తెలియజేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ధ్యానాన్ని గంటల తరబడి చేయాలనే అపోహ బలంగా నాటుకుపోయింది. ధ్యానం సరైన పద్దతిలో చేస్తే, ఏకాగ్రతతో చేయగలిగితే కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని స్పష్టం చేస్తున్నారు. ధ్యానం చేస్తే సాధువులు, సన్యాసినులుగా మారుతారనే అపోహ కారణంగా ధ్యానాన్ని చాలా మంది ఆచరించడం లేదు. అయితే ధ్యానం చేసేవారంతా సాధువులు కారని, మంచి జీవనం సాగించడానికి ధ్యానం ఎంతో ఉపకరిస్తుందని వారు తెలిపారు. ధ్యానం చేయడానికి ఓ సమయం, సరైన ప్రదేశం ఉండాలనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ధ్యానం చేయడానికి సరైన ప్రదేశం కంటే సరైన ఏకాగ్రత అవసరం, అలాగే దిక్కులు కూడా అవసరం లేదు. కావాల్సిందల్లా ఖాళీ కడుపు. అయతే సూర్యోదయాన, సూర్యాస్తమయాన ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తారు తప్ప అది రూల్ కాదు.

  • Loading...

More Telugu News