: మేము వెళ్తే మా బోట్ల సంగతేంటి... ఇంత ఆగ్రహాన్ని మునుపెన్నడూ చూళ్లేదు: మత్స్యకారులు
సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఏడాది కూడా పూర్తి కాకమునుపే మరోసారి కన్నెర్రజేశాడు. పైలిన్ ధాటికి భీతిల్లిన ఉత్తరాంధ్రపైకి హుదూద్ తో దండయాత్రకు సిద్ధమయ్యాడు. హుదూద్ ప్రభావం కనిపిస్తుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఇంత ఉగ్రరూపాన్ని చూడలేదని పేర్కొంటున్నారు. అలలు ఎగసెగసి పడుతున్నాయని సుమారు నాలుగడుగులకు పైగా అలలు లేస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. చూస్తుండగానే సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోందని వారు తెలిపారు. అధికారులు గ్రామాలు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నప్పటికీ తాము సురక్షిత ప్రాంతాలకు తరలలేమని మత్స్యకారులు స్పష్టం చేశారు. తమకు చేపల వేట తప్ప ఇంకోటి చేత కాదని, లక్షలు అప్పులు చేసి వలలు, బోట్లు కొనుగోలు చేశామని వారు తెలిపారు. వాటిని వదిలేసి సురక్షిత స్థావరాలకు తరలితే అవి కొట్టుకుపోతాయని, అదే జరిగితే తమ జీవనాధారం ఏంటని వారు ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తలు చెప్పినప్పటికీ... తాము భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కష్టనష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యామని అన్నారు. కాగా హుదూద్ తుపాను ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. హోరుగాలితో పాటు భీకర అలలు సముద్రపు ఒడ్డు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తుపానుపై నాసా కూడా అధ్యయనం చేస్తోంది. తుపాను దశ, దిశలను జాగ్రత్తగా గమనిస్తోంది. తుపాను తీరం దాటే సమయలో 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని నాసా తెలిపింది. ప్రస్తుతం తుపాను విశాఖకు 260 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో ఉందని నాసా వెల్లడించింది. హరికేన్ల స్థాయిలో తుపాను గాలులు వీస్తాయని హెచ్చరించింది. మేఘాలపై అతి శీతల వాతావరణం నెలకొందని తెలిపిన నాసా, సాధారణంగా మైనస్ 20 నుంచి మైనస్ 23 డిగ్రీల శీతల వాతావరణం నెలకొంటుందని చెప్పింది. అయితే, ప్రస్తుతం మైనస్ 53 డిగ్రీల అతిశీతల వాతావరణం నెలకొందని తెలిపింది.