: గ్రామీణాభివృద్ధి ఎంపీల బాధ్యత: ప్రధాని మోడీ
దేశంలోని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన 'సంసద్ ఆదర్శ గ్రామ యోజన'ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామీణాభివృద్ధిని బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎంపీల్యాడ్స్, కేంద్ర, రాష్ట్ర నిధులను కూడా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రానున్న ఐదేళ్లలో ఒక్కో ఎంపీ మూడేసి గ్రామాల చొప్పున దత్తత తీసుకుని సదరు గ్రామాలను అన్ని రంగాల్లో అగ్రగాములుగా తీర్చిదిద్దాలని కోరారు. తద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేయాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఎంపీ 2016 లోగా తమ నియోకవర్గాల్లో తొలి ఆదర్శ గ్రామాన్ని నిర్మించాలని సూచించారు. తాను కూడా తన సొంత నియోజకవర్గం వారణాసిలోని ఓ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రతి పార్లమెంట్ సభ్యుడు రానున్న ఐదేళ్లలో తమ నియోజకవర్గాల్లోని మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది.