: నేడు తీహార్ జైలుకు చౌతాలా?
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా నేడు తీహార్ జైలులో లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానా సీఎంగా ఉండగా, టీచర్ల కుంభకోణానికి పాల్పడ్డ ఓం ప్రకాశ్ చౌతాలాకు కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు గతేడాది కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అనారోగ్య కారణాల పేరిట బెయిల్ పొందిన చౌతాలా, తన పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీబీఐ, చౌతాలా బెయిల్ ను రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ను విచారించిన కోర్టు...ఎన్నికల ప్రచారంలో పాల్గొనేంతగా ఆరోగ్యం మెరుగై ఉంటే, తక్షణమే జైలులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలతో చౌతాలా తలంటింది. ఈ నేపథ్యంలో మరింత కాలం బయట ఉంటే బాగుండదని గ్రహించిన చౌతాలా నేడు జైలులో లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.