: మోడీ సభలో చోటా రాజన్ సోదరుడు... ట్విట్టర్ లో విమర్శల వెల్లువ!
ప్రధాని నరేంద్ర మోడీ సభల్లో వివాదాస్పద వ్యక్తులు కనిపించడం ఇది రెండోసారి. మొన్నటికి మొన్న హర్యానా ఎన్నికల సభలో ఓ హత్యోదంతంలో జీవిత ఖైదు పడ్డ యువకుడి తండ్రి డీపీ యాదవ్ తో వేదికను పంచుకున్న ప్రధాని మోడీ, తాజాగా అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ సోదరుడితో మహరాష్ట్రలో వేదికను పంచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున చెంబూర్ అసెంబ్లీ నుంచి పోటీకి దిగిన చోటారాజన్ సోదరుడు దీపక్ నిఖాల్జీ, ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీని వేదిక మీదకు ఆహ్వానించడమే కాక మోడీతో షేక్ హ్యాండ్ కూడా చేశారు. ఈ సందర్భంగా నిఖాల్జీ పేరును ప్రస్తావించిన మోడీ, ఆయనకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఒకటి ప్రస్తుతం ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు మోడీపై విమర్శలు కురిపిస్తున్నారు. నేర చరితులతో వేదిక ఎలా పంచుకుంటారంటూ పలువురు మోడీని నేరుగా ప్రశ్నిస్తున్నారు.