: ఏపీ, తెలంగాణల్లో పెరుగుతున్న మావోల ప్రాబల్యం!


రాష్ట్ర విభజన తర్వాత ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లోనూ నిషేధిత మావోయిస్టులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు యత్నాలు మొదలు పెట్టారట. ఇరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పలు ఘటనల ఆధారంగా పోలీసులు ఈ మేరకు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో రెండు రాష్ట్రాల పోలీసులు, మావోల కార్యకలాపాలను ఆదిలోనే అణచివేసేందుకు తీసుకోవాల్సిన వ్యూహరచనలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితం విశాఖలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు యత్నించిన 11 మంది పౌరహక్కుల సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ, మిగిలిన పౌరహక్కుల సంఘాల నేతలు విశాఖ పోలీస్ కమిషనర్ ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవల తిరుపతిలోనూ విలేకరుల సమావేశం నిర్వహించేందుకు యత్నించిన పౌర హక్కుల సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో పౌరహక్కుల సంఘం నేతల అరెస్ట్, తదనంతర పరిణామాలు మావోల పునరాగమనాన్నే సూచిస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. తొలుత పౌర హక్కుల సంఘాలను బలోపేతం చేసుకుని రంగంలోకి దిగాలని మావోలు భావిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. మరి మావోలను అరికట్టడంలో రెండు రాష్ట్రాల పోలీసులు ఏ మేరకు సఫలం అవుతారో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News