: కోట్లా పిచ్ సమన్యాయం చేస్తుందట!
కొచ్చి వన్డేలో విండీస్ భారీ స్కోరు సాధించిన నేపథ్యంలో రెండో వన్డేకు ఆతిథ్యమిస్తున్న ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పిచ్ తీరుతెన్నులపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ కు స్పోర్టింగ్ పిచ్ రూపొందిస్తున్నామని కోట్లా స్టేడియం క్యూరేటర్ అంకిత్ దత్తా తెలిపారు. బౌలర్లకు, బ్యాట్స్ మెన్ కు సమంగా సహకరిస్తుందని, తద్వారా, బ్యాట్ కు బంతికి నడుమ పోరు ఆసక్తికరంగా ఉంటుందని దత్తా వివరించారు. తొలి ఓవర్లలో పేసర్లకు విశేషంగా సహకరిస్తుందని చెప్పారు. మ్యాచ్ ఆరంభానికి ముందు కూడా పిచ్ ను రోల్ చేస్తామని, సాధ్యమైనంత మేర పిచ్ ఉపరితలాన్ని పొడిగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని దత్తా పేర్కొన్నారు. పిచ్ పై పచ్చిక ఉంటుందన్న విషయమై ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ పిచ్ వన్డే మ్యాచ్ కు అతికినట్టు సరిపోతుందని అన్నారు. మంచు పడినా ఇబ్బంది లేదని, నాలుగు సూపర్ సాపర్లను అందుబాటులో ఉంచుతున్నామని దత్తా చెప్పారు. ఈ మైదానంలో భారత్ చివరిసారిగా పాకిస్థాన్ తో వన్డే మ్యాచ్ ఆడింది 2013 జనవరిలో. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్ లో టీమిండియా 10 పరుగుల తేడాతో దాయాదిపై నెగ్గింది. కాగా, కోట్లా పిచ్ స్పందించే తీరుపై ఎన్నో విమర్శలున్నాయి. అనూహ్యమైన బౌన్స్ తో ఒక్కోసారి బ్యాట్స్ మెన్ గాయాలపాలైన సంఘటనలున్నాయి. ఇంతకుముందు శ్రీలంకతో మ్యాచ్ కూడా, పిచ్ ఇలాగే విచిత్రంగా స్పందించడంతో రద్దయింది. ఇదే మైదానంలో భారత్, విండీస్ 1989లో తలపడగా, ఆ మ్యాచ్ లో వివియన్ రిచర్డ్స్ సేన 20 పరుగుల తేడాతో గెలిచింది.