: జయలలిత కోసం మేమెలాంటి పిటిషన్లు వేయలేదు: ఏఐఏడీఎంకే
తమ అధినేత్రి జయలలిత కోసం మద్రాస్, కర్ణాటక హైకోర్టుల్లో తామెలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయం స్పష్టం చేసింది. ఆ పిటిషన్లు వేరెవరో దాఖలు చేశారని, వాటితో అన్నా డీఎంకేకు సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు జయను బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి తమిళనాడు జైలుకు మార్చాలని, ముఖ్యమంత్రిగా ఆమెను కొనసాగించాలంటూ ఏఐఏడీఎంకే పార్టీ నేతలు పిటిషన్లు వేసినట్లు మీడియాలో వస్తున్న వార్తలపై పార్టీ ముఖ్యులు పైవిధంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పి. పళనియప్పన్ మాట్లాడుతూ, "జయలలిత ఇమేజ్ ను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఎవరో ఆ పిటిషన్లు దాఖలు చేశారు. అలాంటి చర్యలు తీవ్రంగా ఖండించదగినవి. పార్టీ న్యాయవాదుల ద్వారానే మా అధినేత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు" అని వెల్లడించారు.