: ప్రతీకారానికి తహతహలాడుతున్న టీమిండియా
విండీస్ చేతిలో తొలి వన్డేలో దారుణంగా భంగపడిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు ఢిల్లీలోని ఫిరోజ్ కోట్లా మైదానంలో జరిగే రెండో వన్డేలో నెగ్గి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే, అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ధోనీ సేన డొల్లతనం కొచ్చి వన్డేలో తేటతెల్లమైంది. బ్యాటింగ్, బౌలింగ్... ఇలా, అన్ని రంగాల్లో కరీబియన్లు ఆధిపత్యం ప్రదర్శించారు. విండీస్ జట్టును నిలువరించాలంటే రేపటి మ్యాచ్ లో లోటుపాట్లు సవరించుకుని బరిలో దిగాల్సి ఉంటుంది. ముఖ్యంగా, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమి టీమిండియా శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్ పర్యటన నుంచి కొనసాగుతున్న వైఫల్యాల పరంపరను కోహ్లీ విండీస్ తో సిరీస్ లోనూ కొనసాగిస్తున్నాడు. కొచ్చి వన్డేలో కేవలం రెండు పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అటు బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. విండీస్ టాపార్డర్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. అతనికి సహకరించేవాళ్ళే కరవయ్యారు. గాయపడిన మోహిత్ శర్మ స్థానంలో సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులోకి రావడం జట్టుకు లాభించేదే. ఉన్న వనరులను ధోనీ సమర్థంగా వినియోగించుకోవడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని మాజీలు సూచిస్తున్నారు.