: సెప్ బ్లాటర్ అభిప్రాయం తప్పని నిరూపిస్తాం: అభిషేక్ బచ్చన్
భారత్ లో క్రికెట్ కు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో తెలియంది కాదు. క్రికెట్ కారణంగా, తమ ఉనికిని చాటుకునేందుకు కబడ్డీ, ఫుట్ బాల్ తదితర క్రీడలు ఆపసోపాలు పడుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. అభిషేక్ బచ్చన్ వంటి సినిమా స్టార్లు, సచిన్, గంగూలీ వంటి క్రికెటర్లు ఇతర క్రీడల అభ్యున్నతిపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా, అభిషేక్ బచ్చన్ కబడ్డీపై విశేష అభిమానం చూపుతున్నాడు. తొలిసారిగా నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్ లో అభిషేక్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ టైటిల్ విజేతగా అవతరించింది. తాజాగా, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సాకర్ పోటీల్లోనూ అభిషేక్ బచ్చన్ చెన్నయ్యన్ ఎఫ్ సీ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. తన జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అభిషేక్ ముంబయిలో ఘనంగా నిర్వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాకర్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తో ముచ్చటించానని చెప్పాడు. వందకోట్లకు పైగా జనాభా ఉన్న దేశం 11 మంది సాకర్ ఆటగాళ్ళను ఎందుకు తయారుచేసుకోలేకపోతోందని ఆయన అన్నాడని అభిషేక్ తెలిపాడు. ఇప్పుడు ఐఎస్ఎల్ ద్వారా ఫిఫా అధ్యక్షుడి అభిప్రాయం తప్పని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ లీగ్ తో మెరికల్లాంటి ఆటగాళ్ళు వెలుగులోకి వస్తారని ఈ జూనియర్ బచ్చన్ పేర్కొన్నాడు.