: మీరెంతిస్తే... మేమూ అంతే: ఏపీ సర్కారుకు షాకిచ్చిన బ్యాంకర్లు!
ఆంధ్రప్రదేశ్ లో పంట రుణాల మాఫీ రోజుకో మలుపు తిరుగుతోంది. పంట రుణాల మాఫీ కోసం సాధికారత మిషన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఏటా 20 శాతం మేర బకాయిలను చెల్లిస్తామని బ్యాంకులకు చెప్పింది. దీనికి తొలుత బ్యాంకర్లు సరేనన్నా, తాజాగా మీరెంతిస్తే, మేమూ అంతే మొత్తంలో కొత్త రుణాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది 20 శాతం రుణాలను చెల్లిస్తే, తాము కూడా కొత్తగా 20 శాతం మాత్రమే కొత్త రుణాలను మంజూరు చేస్తామని తేల్చిచెప్పినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. బ్యాంకులు ప్రతిపాదిస్తున్న ఈ విధానం ప్రకారం రూ. 20 వేల రుణం పొందేందుకు అర్హత ఉన్న రైతుకు కేవలం రూ.4 వేల కొత్త రుణం మాత్రమే లభించనుంది. రూ.1.5 లక్షల రుణ అర్హత ఉన్న రైతుకు కేవలం రూ.30 వేల కొత్త రుణం మాత్రం అందనుంది. ఇదిలా ఉంటే, ఈ 20 శాతం కొత్త రుణాలు కూడా ప్రభుత్వం చెల్లించనున్న 20 శాతం బకాయిలు జమ అయిన తర్వాతే జారీ చేస్తామని మెలిక పెట్టాయట. తొలివిడతగా 20 శాతం బకాయిలను ఈ నెల 22న బ్యాంకులకు అందజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అంటే, 20 శాతం కొత్త రుణాలు మంజూరు కావాలన్నా, ఈ నెల 22 దాకా రైతులు ఆగాల్సిందేనన్నమాట.