: విండీస్ తో సిరీస్ సజావుగానే సాగుతుంది: బీసీసీఐ
కొచ్చి వన్డే ఆరంభానికి ముందు వెస్టిండీస్ ఆటగాళ్ళు వారి క్రికెట్ బోర్డుపై నిరసన బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే, బీసీసీఐ జోక్యంతో వివాదం సద్దుమణిగి, ఆ వన్డే మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఆ పోరులో భారత్ ఓటమిపాలవడం అటుంచితే... విండీస్ క్రికెటర్లకు, వారి బోర్డుకు మధ్య విభేదాలు పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. దీంతో, 'ఐదు వన్డేల సిరీస్ పై నీలి నీడలు' అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిపై బీసీసీఐ స్పందించింది. విండీస్ ఆటగాళ్ళ తరపున విండీస్ క్రికెట్ బోర్డుతో తాము మాట్లాడతామని బీసీసీఐ హామీ ఇచ్చింది. పారితోషికం చెల్లింపుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపింది. సిరీస్ కు వచ్చిన ముప్పేమీ లేదని, షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లు జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. ఈ వివాదంలో బీసీసీఐ క్రియాశీలక పాత్ర పట్ల విండీస్ క్రికెట్ బోర్డు చైర్మన్ డేవ్ కామెరాన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇ-మెయిల్ పంపారని పటేల్ వెల్లడించారు. సిరీస్ ముగిసిన తర్వాత ఈ వ్యవహారంలో బీసీసీఐ సంతోషంగా మధ్యవర్తిత్వం వహిస్తుందని ఆయన తెలిపారు.